​రక్షకులే భక్షకులవుతుంటే.. కాలనీ సంఘాల ముసుగులో భూదందా! హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు

 


హైదరాబాద్ (Suryanews): మన కాలనీని మనమే కాపాడుకోవాలని ఏర్పడిన 'వెల్ఫేర్ అసోసియేషన్' ప్రతినిధులే కాలనీ ఆస్తులను కాజేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? పార్కులు, స్కూల్ గ్రౌండ్లు, ప్రజావసరాల స్థలాలను కాపాడాల్సిన వారే కబ్జాదారులతో చేతులు కలిపి ప్లాట్లు వేసి అమ్మేస్తున్న ఉదంతాలు 'హైడ్రా ప్రజావాణి'లో వెలుగులోకి వచ్చాయి.

​సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి బాధితులు తరలివచ్చారు. మొత్తం 72 ఫిర్యాదులు అందగా, అందులో మెజారిటీ ఫిర్యాదులు కాలనీ సంఘాల అక్రమాలపైనే ఉండటం గమనార్హం.

స్కూల్ గ్రౌండ్ ఆక్రమణ.. చెరువుల చెర!

కూకట్‌పల్లి వెంకటేశ్వర నగర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌ను కొంతమంది వ్యక్తులు కుటుంబ సమేతంగా ఆక్రమించుకున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఆటస్థలం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి, గచ్చిబౌలి, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో పార్కులు, సెప్టిక్ ట్యాంకులు, వాటర్ ట్యాంకర్ల కోసం కేటాయించిన స్థలాలను కూడా రియల్టర్లకు అప్పగిస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.

​మణికొండలోని ఎల్లమ్మ చెరువు ఆక్రమణలు, ఖానామెట్‌లోని వెలమ సంఘం భూమి కబ్జా యత్నాలపై కూడా ఫిర్యాదులు అందాయి. కోర్టు కేసులు నడుస్తున్నా, కొందరు అదను చూసుకుని అర్ధరాత్రి వేళల్లో భవనాలు నిర్మిస్తున్నారని బాధితులు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు.

​రంగంలోకి ఏవీ రంగనాథ్...


ఫిర్యాదులన్నింటినీ స్వీకరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో, హైడ్రా బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణలను నిర్ధారిస్తాయని స్పష్టం చేశారు. అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

  -సూర్య న్యూస్, హైదరాబాద్ 

Comments

Popular posts from this blog

హస్తిన వేదికగా అంబేద్కర్ వర్సిటీ సత్తా.. ఢిల్లీ 'AI సదస్సు'లో ప్రొఫెసర్ పల్లవి కాబ్డే కీలక పాత్ర!

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు గమనిక: ఫిబ్రవరి 9 నుంచి బీఎస్సీ ప్రాక్టికల్స్

అక్షర యాత్ర: పుస్తక పఠనం కోసం కదిలిన 'గ్రంథాలయ రథం' - హైదరాబాద్ టూ అమరావతి